Pages

Labels

Blog Archive

Popular Posts

Monday, 24 December 2012

Pain killers with our food , ఆహారము తో పెయిన్ కిల్లర్లు


  •  







పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.


జబ్బుల నుంచి బయటపడటానికి టాబ్లెట్లే వేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రకృతి అందించిన ఆహార పదార్థాలే మంచి ఔషధాలుగా పనిచేస్తాయన్నది ప్రకృతి వైద్య నిపుణులు ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నారు. అదే నిజమని మరిన్ని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. ఇరిటిబుల్ బొవెల్ సిండ్రోమ్ లాంటి జీర్ణకోశ సమస్యల వల్ల కలిగే కడుపునొప్పి, నడుంనొప్పి, కీళ్లనొప్పులు.. ఇలా నొప్పి ఏదైనా సరే.. నొప్పిని తెలియజేసే నాడుల మార్గాలను ఆపేయడం ద్వారా గానీ, ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడం ద్వారా మాత్రమే కాకుండా నొప్పిని మూలాల్లోంచి తీసేయగల శక్తి ఆహారపదార్థాలకు ఉంది. తలనొప్పిగా ఉందంటే ఏ జండూబామో రాసుకుంటాం..

ఒళ్లంతా నొప్పులంటే ఏ పెయిన్ కిల్లర్ టాబ్లెట్టో వేసుకోమంటాం. కానీ ఈ పెయిన్ కిల్లర్ మాత్రలు ఎంత ఎక్కువగా వాడితే అంతటి దుష్ప్రభావం ఉంటుందనీ తెలుసు. కానీ ఒక్కోసారి నొప్పి తగ్గాలంటే వాటిని వాడక తప్పని పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పెయిన్ కిల్లర్స్ కోసం పరుగులు తీయకుండా మనం తినే ఆహారం వైపు ఓ లుక్కేయమంటున్నారు పరిశోధకులు. మనం తీసుకునే ఆహారంలోనే చాలా రకాల నొప్పులను తగ్గించగలిగిన సుగుణాలు ఉన్నాయని ఇటీవలి అధ్యయనాలు వెల్లడిచేశాయి. నొప్పి తగ్గించడంలో మందులు చేసే పనే ఇవీ చేస్తాయనీ అదీ ఎటువంటి సైడ్ ఎఫెక్టులు లేకుండా.. అనీ చెబుతున్నారు అధ్యయనకారులు.


  • curd-పెరుగుతో పొట్ట క్షేమం


మనలో 40 శాతం మంది ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్‌తో బాధితులున్నారని అంచనా. దీనివల్ల విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతుంటారు. దీనికి మంచి పరిష్కారాన్ని చూపేవి అతి చిన్న సూక్ష్మజీవులైన బాక్టీరియా అంటున్నారు నిపుణులు. లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్, లాక్టోకోకస్ లాక్టిస్ లాంటి మేలు చేసే ఈ బాక్టీరియా పెరుగులో పుష్కలంగా ఉంటాయి. పొట్ట ఉబ్బరాన్ని, కడుపు నొప్పిని తగ్గించడంలో ఇవి కీలకపాత్ర వహిస్తాయి. ప్రతిరోజూ ఒకటి లేదా రెండు కప్పుల పెరుగు తీసుకుంటూ ఉంటే ఐబిఎస్ నుంచి ఉపశమనం కలుగుతుంది.


  • Herbal Tea - హెర్బల్ టీ


తలనొప్పిగా ఉంది.. టీ తాగాలి అని చాలా సార్లు అనుకుంటూనే ఉంటాం. ఆ తాగే టీ ఏదో హెర్బల్ టీ తాగండి.. తలనొప్పి ఉండదు అంటున్నారు పరిశోధకులు. గ్రీన్ టీలో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కెఫీన్ చాలా తక్కువగా ఉంటుంది. 150 మిల్లీలీటర్ల కప్పు గ్రీన్ టీలో pandu నుంచి 36 మిల్లీక్షిగాముల కెఫీన్ మాత్రమే ఉంటుంది. అదే ఫిల్టర్ కాఫీలో అయితే 106 నుంచి 164 మిల్లీక్షిగాముల కెఫీన్ ఉంటుంది. గ్రీన్ టీలో ఉన్న కెఫీన్ రక్తనాళాలు వ్యాకోచం చెందేలా (వాసో డైలేషన్) చేస్తుంది. ముడుచుకుపోయిన రక్తనాళాలు రిలాక్స్ కావడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అయితే గర్భిణులు, రక్తహీనత ఉన్నవారు డాక్టర్ సూచనల మేరకే ఈ టీ తీసుకోవాలి. ఎందుకంటే టీలో ఉంటే టానిన్లు కొన్ని రకాల పోషకాలను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి.


  • cherries -చెర్రీతో కీళ్లు భద్రం


చెర్రీ పండ్లలో ఆంథోసయనిన్లు అనే శక్తివంతమైన యాంటి ఆక్సిడెంట్లు ఉంటాయి. నొప్పిని తగ్గించడానికి ఇవి రెండు రకాలుగా పనిచేస్తాయి. యాస్ప్రిన్, నాప్రోక్సెన్ లాంటి ఇతర నాన్ స్టిరాయిడల్ యాంటి ఇన్‌ఫ్లమేటరీ మందుల మాదిరిగానే ఇవీ పనిచేస్తాయి. ఇన్‌ఫ్లమేషన్ ప్రక్రియను బ్లాక్ చేయడమే కాకుండా నొప్పికి కారణమయ్యే ఎంజైమ్‌లను కూడా అడ్డుకుంటాయి. ఒక కప్పు చెర్రీపండ్లను ప్రతిరోజూ తీసుకుంటే కీళ్లవాపు 25 శాతం వరకూ తగ్గిపోతుందంటున్నారు పరిశోధకులు. రోజూ రెండు సార్లు 360 మిల్లీలీటర్ల చెర్రీ పండ్లరసాన్ని తీసుకుంటూ ఉండటం వల్లనే చాలామంది అథ్లెట్లలో ముఖ్యంగా రన్నింగ్‌లో పాల్గొనేవారిలో కండరాల నొప్పి చాలా తక్కువగా ఉన్నట్టు అధ్యయనాల్లో తేలింది. అందుకే రోజూ చెర్రీలు తీసుకోండి పిక్క(కండర)బలం పెంచుకోండి అంటున్నారు అధ్యయనకారులు.


  • Turmeric - పసుపు.. యాంటి ఇన్‌ఫ్లమేటరీ..


ఎక్కడైనా చర్మం కోసుకుని రక్తం కారుతుంటే వెంటనే వంటగదిలో నుంచి పసుపు తెచ్చి అక్కడ రాయడం పరిపాటే. నిజానికి ఆయుర్వేద వైద్యం పుట్టినప్పటి నుంచీ వైద్యంలో పసుపుకి విశిష్ట స్థానమే ఉంది. నొప్పి తగ్గించేందుకు, జీర్ణవ్యవస్థ చురుకుదనానికి, యాంటి బాక్టీరియల్ ప్రభావానికి పసుపును ఇప్పటికీ ఒక ఔషధంగా వాడుతున్నారు. చర్మ సౌందర్యం పెంచడంలో కూడా పసుపుకే పెద్దపీట. వీటన్నిటికి తోడు పసుపులో యాంటి ఇన్‌ఫ్లమేటరీ ప్రభావాన్ని చూపగల గుణం కూడా ఉందంటున్నారు పరిశోధకులు. దీనిలో ఉంటే కర్క్యుమిన్ వల్లనే పసుపు ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారాన్ని చూపుతోంది. కణాలు దెబ్బతినకుండా నివారించగలిగే పసుపు కీళ్లలో వాపును కూడా అరికట్టగలదు. అంతేకాదు.. నాడీకణాల పనితీరును మెరుగుపరుస్తుంది. రోజుకి 1 నుంచి 2 గ్రాముల పసుపును తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మన భారతీయ వంటకాల్లో ఈ మోతాదు పసుపును చేర్చడం పెద్ద విషయమేమీ కాదు. అయితే ఇంతకన్నా కాస్త ఎక్కువైనా పరవాలేదంటారు అధ్యయనకారులు. కూరల్లోనే కాదు.. చపాతీ పిండిలో, ఇడ్లీ, దోసె పిండిలో కూడా పసుపును వాడవచ్చంటున్నారు. పసుపును ఉపయోగించినప్పుడల్లా కాస్త మిరియాల పొడి కూడా వాడటం వల్ల మంచి ఫలితాలుంటాయి. ఎందుకంటే మిరియాలు పసుపులోని కర్క్యుమిన్ వినియోగానికి ఉపయోగపడతాయి.


  • Ginger - ఆర్థరైటిస్‌కి అల్లం


జీర్ణశక్తిని పెంచే అల్లం వాంతులు, వికారానికి కూడా మందుగా పనిచేస్తుంది. వాంతులను ప్రేరేపించే రీసెప్టర్లను బ్లాక్ చేయడం ద్వారా ఇది సహాయపడుతుంది. పేగుల్లో ఏర్పడే గ్యాస్‌ను పోగొట్టే ఔషధం కూడా. వీటికి తోడు అల్లంలో మరో సుగుణం కూడా ఉంది. అదే యాంటి ఇన్‌ఫ్లమేటరీ ప్రభావం. సాధారణ కండరాల నొప్పి దగ్గరి నుంచి మైగ్రేన్ తలనొప్పి, ఆర్థరైటిస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు కూడా ఇది దివ్యౌషధం. కూరల్లో వాడటమే కాకుండా బార్లీతో కలిపి అల్లం రసాన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అల్లం ముక్కలను నిమ్మరసం, తేనెతో కలిపి తీసుకున్నా రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.


  • fish - నడుంనొప్పికి చేప


మెర్క్యురీ లేకుండా ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉన్న చేపలు ఆరోగ్యకరమైన వెన్నుపాముకు దోహదం చేస్తాయి. వెన్నుపాము డిస్కుల చివర్లలో ఉండే రక్తనాళాలు అన్ని ముఖ్యమైన పోషకాలను డిస్కులకు సరఫరా చేస్తాయి. ఈ రక్తసరఫరా తక్కువ అయితే డిస్కులకు తగినంత ఆక్సిజన్, పోషకాలు అందక అవి వదులయిపోతాయి. తద్వారా నెమ్మదిగా దెబ్బతినడం ఆరంభమవుతాయి. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఈ రక్తసరఫరా బావుండేందుకు సహాయపడతాయి. అంతేకాదు... రక్తనాళాలు, నాడుల్లో ఇన్‌ఫ్లమేషన్ రాకుండా నివారిస్తాయి. ఒమేగా-3తో పాటు రోజుకి ఒకవూటెండు గ్రాముల ఇహెచ్‌ఎ, డిపిఎ తీసుకుంటే మెడ, వెన్ను, నడుము నొప్పుల నుంచి మరింత త్వరగా ఉపశమనం దొరుకుతుందంటారు నిపుణులు. నిజానికి చేపనూనెలు గుండె, రక్తనాళాల ఆరోగ్యానికి చాలా మంచివి. శాకాహారులకు అవిసె గింజల్లో కావలసినంత ఒమేగా-3 ఫాటీఆమ్లాలు లభిస్తాయి. దీనితో పాటు రోజూ పావు కప్పు వాల్‌నట్స్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

Courtesy with Sakala@Namste Telangana news paper.



  • =====================


Visit my Website - Dr.Seshagirirao...