Alternative substances for sweet(sugar), చక్కెర(తీపి) కి ప్రత్యామ్నాయ పదార్ధాలు
తియతియ్యని వంటకాల్ని చూడగానే ఎవరికైనా నాలుక జివ్వున లాగేస్తుంది. ఒక ముక్కయినా నోట్లో పెట్టుకోకపోతే.. మనసు వూరుకోదు. అదేపనిగా అటువైపే లాగేస్తుంది. తీపి తహతహ తీవ్రతే అలాంటిది. మరోవైపు తీపి పదార్థాల్లో ఉండే చక్కెర మనల్ని భయపెడుతూ వెనక్కి నెడుతుంటుంది. మరిలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గమే లేదా? ఇలాంటప్పుడు చక్కెరకు బదులుగా ఇతర పదార్థాల్ని వెదుక్కోవటమే మేలు. చక్కెరకు తేనె, పండ్లు మంచి ప్రత్యామ్నాయాలు. వీటినీ పరిమిత మోతాదుల్లో తీసుకోవటమే మంచిదని హెచ్చరిస్తున్నారు. తీపి విషయంలో నిత్యం మనల్ని వేధించే కొన్ని సందేహాల్ని తీర్చుకుందామిలా..
తేనెతో ఆరోగ్య ప్రయోజనాలేమిటి?
తేనెలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్, మెగ్నీషియం, ఇనుము, క్యాల్షియం వంటి ఖనిజాలు, బి-కాంప్లెక్స్ వంటి విటమిన్లు ఉంటాయి. తేనెలో సమృద్ధిగా ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఇది సూక్ష్మక్రిమినాశినిగా, యాంటీఇన్‌ఫ్లమేటరీగానూ పనిచేస్తుంది. అంతేకాదు, ఇందులో కొవ్వు ఉండదు. కాకపోతే.. క్యాలరీలు కాస్త ఎక్కువగా ఉంటాయి. ఆ విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం.
అల్పాహారానికి పండ్లు ప్రత్యామ్నాయమా?
అల్పాహారానికి పండ్లు చక్కని ప్రత్యామ్నాయం. అవి పీచు, ఫ్రక్టోజ్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి. ఎక్కువెక్కువ క్యాలరీలు లేకుండానే వీటన్నింటినీ పొందవచ్చు. పండ్లను చిరుతిండ్లలా కూడా తినొచ్చు.
తీపిని పూర్తిగా పక్కన పెట్టాలా?
చక్కెరను ఎక్కువెక్కువగా తీసుకోవటం వల్ల రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. దీనివల్ల పలురకాల వ్యాధుల బారిన పడే అవకాశాలు పెరుగుతాయి. చక్కెరను రోజుకు రెండు చెంచాలకు మించి తీసుకోవద్దు. పూర్తిగా మానేసినా మంచిదే. ఎండుద్రాక్ష, ఖర్జూరాలు, బెల్లం, తేనె వంటివి తీసుకోవచ్చు.
తీపి తహతహను ఎలా అణచుకునేది?
తీపి తహతహను నియంత్రించుకునేందుకు ఇతరత్రా ఆహార పదార్థాల్ని తీసుకోవాలి. బాగా శుద్ధి చేసిన ఆహార పదార్థాల్ని, ఐస్‌క్రీముల వంటి వాటిని మానెయ్యాలి. నీటిని ఎక్కువగా తాగాలి. పీచు సమృద్ధిగా ఉండే పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు తినాలి. మాంసకృత్తులు అధికంగా ఉండే ఆహారం వల్ల రక్తంలో చక్కెర అదుపులో ఉంటుంది. తీపిపై తహతహ తగ్గుతుంది.
- ============================
Visit my Website - Dr.Seshagirirao...