Pages

Labels

Blog Archive

Popular Posts

Thursday, 18 April 2013

Millets and health - చిరుధాన్యాలు.ఆరోగ్యము ,తృణధాన్యాలు.ఆరోగ్యము,మిల్లెట్స్‌.ఆరోగ్యము


  •  





  •  


పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



    



సజ్జలు, రాగులు, కొర్రలు, సామలు, వరిగలు, ఒడలు, అరికెలు... ఇవన్నీ చిరు/తృణధాన్యాలే. వీటన్నింటినీ కలిపి ఇంగ్లిష్‌లో మిల్లెట్స్‌ అంటారు. పోషకాలను బట్టి ముతకధాన్యాల్లోని రకాలైన జొన్నల్ని కూడా ఈ జాబితాలోకి చేరుస్తుంటారు.



మనిషి తొలినాళ్లలో సాగుచేసిన పంటల్లో ఇవే ఎక్కువ. కానీ అభివృద్ధి చెందిన, చెందుతోన్న దేశాలన్నీ వీటిని వదిలి రుచికోసమే కావచ్చుగాక... బియ్యం, గోధుమల్నే ఎక్కువగా ఆశ్రయిస్తున్నాయి.



దాంతో గత కొన్నేళ్లుగా మన ఆహారంలో ప్రధానపాత్ర పోషిస్తున్న బియ్యం మీద అనేక పరిశోధనలు చేస్తున్నారు నిపుణులు. బాగా పాలిష్‌ చేసిన బియ్యం తినడంవల్ల బరువు పెరగడం, మధుమేహం బారినపడటం పెరిగింది. ఆధునిక జీవనశైలి కూడా మరో కారణం. ఈ పరిస్థితుల్లో మిల్లెట్స్‌ని రోజూవారీ ఆహారంలో భాగంగా చేర్చాల్సిన అవసరం ఉందనీ, ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివనీ వాళ్లు నొక్కి చెబుతున్నారు.



పీచు ఎక్కువగా ఉండటంతో వీటి పిండితో రుచికరమైన వంటలు చేయలేం. చూడ్డానికీ అంత బాగుండవు. అందుకే చిరుధాన్యాల వాడకం బాగా తగ్గింది. ఇప్పుడు పొట్టు తీసి, పీచును తగ్గించి మృదువైన పిండిని తయారుచేసే యంత్రాలు చాలానే వచ్చాయి. వీటిద్వారా పిండి, రవ్వ పట్టిస్తే అన్ని రకాలూ చేసుకోవచ్చు.



ఎందుకు తినాలి?

బియ్యం, జొన్నల్లో మాదిరి పిండి పదార్ధాలూ గోధుమల్లోని ప్రొటీన్లూ వాటిల్లో లేని విధంగా కొద్దిపాళ్లలో కొవ్వులూ చిరుధాన్యాల్లో ఉంటాయి. అందుకే ఇవి సమతులాహారంగా ఉపయోగపడతాయి. సజ్జలు, సామలతో పోలిస్తే రాగుల్లో కొవ్వుల శాతం చాలా తక్కువ.

* చిరుధాన్యాలన్నింటిలోనూ బి-విటమిన్‌ శాతం ఎక్కువ. ఐరన్‌, కాల్షియం, మాంగనీస్‌, ఫాస్ఫరస్‌, పొటాషియం, మెగ్నీషియం, జింక్‌... ఖనిజాలన్నీ సమృద్ధిగా ఉంటాయి.

* మరే ధాన్యంలోనూ లేని విధంగా 100 గ్రా. రాగుల నుంచి 344 మి.గ్రా. కాల్షియం లభిస్తుంది. కాల్షియం ఎక్కువగా ఉండటంవల్ల దంతాలూ ఎముకల పరిపుష్టికి ఇవి దోహదపడతాయి.

* వీటిల్లో అధికంగా ఉండే మెగ్నీషియం వల్ల డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం తక్కువ. ముఖ్యంగా కొర్రలవల్ల మధుమేహం తగ్గుతుందని వేంకటేశ్వర విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు. కొరియన్‌ నిపుణులు ఎలుకల్లో చేసిన పరిశీలనల్లో కూడా ఇతర వాటితో పోలిస్తే కొర్రలు తీసుకున్నప్పుడు ట్రై గ్లిజరైడ్ల శాతం బాగా తగ్గిందనీ అందువల్ల హృద్రోగులకు ఇవి ఎంతో మంచివనీ చెబుతున్నారు.

* పీచు ఎక్కువగా ఉండటంవల్ల చిరుధాన్యాల్లోని పిండిపదార్థాలు మెల్లగా జీర్ణమవుతాయి. గ్లూకోజ్‌ రక్తంలోకి నెమ్మదిగా విడుదలవుతుంటుంది. అందుకే మధుమేహరోగులకి ఇవి ఎంతో మంచివి. ఈ పీచు వల్ల కాస్త తినగానే పొట్ట నిండిపోయినట్లుగా అనిపిస్తుంది. దాంతో అతిగా తినే ప్రమాదమూ తప్పుతుందన్నది నిపుణుల ఉవాచ.

* వీటిల్లోని పీచు వల్ల పిత్తాశయంలో రాళ్లు ఏర్పడవు.

* అన్నింటికన్నా ముఖ్యంగా మిల్లెట్స్‌లో ఫైటేట్స్‌, టానిన్స్‌ అనే యాంటిఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌నీ మధుమేహాన్నీ తగ్గిస్తాయి. ఛత్తీస్‌గఢ్‌లో ఎక్కువగా పండించే అరికెల్లోనూ తరవాత రాగుల్లోనూ ఈ రకమైన ఫినాలిక్స్‌ అత్యధికంగా ఉన్నాయని తేలింది. అరికెల్ని ఆయుర్వేద వైద్యంలోనూ వాడుతుంటారు.

* వీటిల్లోని ఫైటేట్స్‌ మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండానూ క్యాన్సర్లూ, గుండెవ్యాధులు రాకుండానూ కూడా కాపాడతాయట.

* ఎలాంటి ఆమ్లగుణం లేని చిరుధాన్యాలు ఎసిడిటీతో బాధపడేవాళ్లకి ఎంతో మేలు.

* మెనోపాజ్‌ దాటిన మహిళలూ, అధికరక్తపోటూ, కొలెస్ట్రాల్‌తో బాధపడేవాళ్లూ మిల్లెట్స్‌ని తమ ఆహారంలో భాగంగా చేసుకోవడం ఎంతో మంచిది.

* వీటిల్లో అలర్జీ కలిగించే గుణం ఉండదు. అందుకే చిరుధాన్యాల మొలకల్ని పిండి పట్టించి, వండిన ముద్దను పిల్లలకీ, పాలిచ్చే తల్లులకీ, ముసలివాళ్లకీ కూడా పెడుతుంటారు.

* థైరాయిడ్‌ వ్యాధితో బాధపడేవాళ్లు మాత్రం మిల్లెట్స్‌ని మితంగా తీసుకోవడం మంచిది. వీటిల్లో అయొడిన్‌ని వ్యతిరేకించే గుణం ఎక్కువ.

ఎలా తినాలి?

కొర్రలయినా, సజ్జలయినా అన్నం వండాలంటే తీసుకున్న ధాన్యానికి సుమారు మూడురెట్లు నీళ్లు పోసి ఉడికించాలి. అన్నం రూపంలోనే తీసుకోవాల్సిన పనిలేదు... పిండి లేదా రవ్వగా చేసుకుని మన అభిరుచికి తగినట్లుగా ఉప్మా, దోశ, ఇడ్లీ, వడ, బజ్జీ, నిప్పట్లు, పొంగల్‌, ముద్ద, కిచిడీ, బిర్యానీ, పాయసం, రొట్టె... ఇలా పలు రుచుల్లో చేసుకుని తినవచ్చు. పిండిని బేక్‌డ్‌ ఉత్పత్తుల్లోనూ వాడుకోవచ్చు. ధరలు పెరిగిపోతున్నాయంటూ గగ్గోలు పెడుతూ బియ్యాన్నీ గోధుమల్నీ మాత్రమే కొనుగోలు చేసేవాళ్లంతా వాటికన్నా శ్రేష్ఠమైన చిరుధాన్యాల్ని నమిలి తింటే వాటి ధరలూ దిగి వస్తాయి. మన భోజనం ప్లేటుతో పాటు పంటల్లోనూ వైవిధ్యం పెరుగుతుంది. నేలతల్లీ సారవంతమవుతుంది.



చిరుధాన్యాలు.. /- డా.జానకీ శ్రీనాథ్‌,-పోషకాహార నిపుణులు

శరీరానికి అవసరమైన పోషకాలన్నీ అందిస్తాయి. అదే సమయంలో చిన్నచిన్న అనారోగ్యాలు మొదలు, క్యాన్సర్లూ, కొన్నిరకాల గుండెజబ్బుల్లాంటివి రాకుండా కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇరవై ఏళ్లున్న వారు మొదలు మెనోపాజ్‌ దశ దాటిన మహిళల వరకూ వీటిని తీసుకోవడం వల్ల కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు. జొన్నలూ, రాగులూ, సజ్జలూ, కొర్రలూ, సామల్లాంటివన్నీ చిరుధాన్యాలే.

సన్నగా మారాలనుకుంటున్నారా..
చిరుధాన్యాల్లో పీచుశాతం, నిదానంగా జీర్ణమయ్యే పిండిపదార్థాలు ఎక్కువగా, కొవ్వుశాతం తక్కువగా ఉంటాయి. అందుకే కొద్దిగా తీసుకున్నా పొట్ట నిండినట్లు అనిపిస్తుంది. తరవాత కొన్ని గంటలపాటు ఆకలి వేయదు. ముఖ్యంగా జొన్నల్నే తీసుకుంటే వీటి నుంచి మాంసకృత్తులు సమృద్ధిగా అందుతాయి. ఇనుమూ, క్యాల్షియం, జింక్‌, పొటాషియం, పాస్ఫరస్‌ లాంటి పోషకాలూ లభిస్తాయి. అదనంగా థయామిన్‌, రైబోఫ్లేవిన్‌ లాంటి బి విటమిన్లూ... టానిన్లూ, ఫెనోలిక్‌ ఆమ్లాలూ, యాంథోసియానిన్స్‌ లాంటి ఫైటోకెమికల్స్‌ అందుతాయి. ఇవన్నీ బరువు తగ్గించడానికి ఉపయోగపడేవే. శరీరానికి శక్తినిచ్చేవే. గర్భిణులు తాము తీసుకునే ఆహారంలో జొన్నల్ని చేరిస్తే వాళ్లకు అవసరమైన విటమిన్లూ, ఖనిజాలూ అందుతాయని అధ్యయనాల్లో తేలింది. జొన్నల్ని పిండిరూపంలో గోధుమలకు ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు.

రక్తహీనత తగ్గించి...
మన దేశంలో దాదాపు డెబ్భైశాతం మహిళల్లో రక్తహీనత సమస్య ఉంటుంది. దాన్ని అదుపులో ఉంచాలంటే శరీరానికి తగినంత ఇనుము అందాలి. ఆ పోషకాన్ని అందించడంలో ముందుంటాయి రాగులు. ఇనుము ఒక్కటే కాదు, మాంసకృత్తులూ, క్యాల్షియం.. ఎ, బి విటమిన్లు, ఫాస్పరస్‌ లాంటి పోషకాలు సమృద్ధిగా అందిస్తాయివి. ఇందులో ఉండే పీచు మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది. కేవలం రక్తహీనత తగ్గడమే కాదు, వీటిలోని క్యాల్షియం ఎముకల్ని దృఢంగా ఉంచుతుంది. దాంతో కీళ్లనొప్పులూ, మెనోపాజ్‌ తరవాత ఆస్టియోపోరోసిస్‌ లాంటివి వచ్చే ప్రమాదం తగ్గుతుంది. గర్భిణులూ, పాలిచ్చే తల్లులూ రాగుల్ని ఎక్కువగా తీసుకుంటే పాల ఉత్పత్తి బాగుంటుంది. రాగులు మైగ్రెయిన్‌ తలనొప్పిని తగ్గిస్తాయి. వీటిల్లో ఉండే మెగ్నీషియం నెలసరి సమయంలో వచ్చే నొప్పులూ, అసౌకర్యాన్ని దూరం చేస్తుంది. రాగుల్ని అచ్చంగా అలాగే కాకుండా పిండిలా, జావలా, రొట్టె రూపంలో తీసుకోవచ్చు.

అనారోగ్యాలు దూరం..
నలభై దాటకుండానే అధిక రక్తపోటూ, మధుమేహం లాంటి సమస్యలు ఈ రోజుల్లో చాలామంది మహిళల్ని వేధిస్తున్నాయి. వాటి ప్రమాదాన్ని తగ్గించుకోవాలంటే చిరుధాన్యాల్ని మించిన పరిష్కారం లేదంటున్నాయి అధ్యయనాలు. వీటిల్లో ఉండే మెగ్నీషియం రక్తనాళాలు విశ్రాంతి పొందేలా చేసి, రక్తప్రసరణ సజావుగా జరిగేందుకు దోహదం చేస్తుంది. దాంతో అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. ఆ పోషకాన్ని సమృద్ధిగా అందుకోవాలంటే బార్లీ, సజ్జలూ, రాజ్‌గీరా, సామల్లాంటివి తీసుకోవాలి. చిరుధాన్యాల్లో గ్త్లెసమిక్‌ ఇండెక్స్‌ తక్కువ. దాంతో అవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడతాయి. ఫలితంగా ఇన్సులిన్‌ని నియంత్రించి రక్తంలో చక్కెరస్థాయులు అదుపులో ఉంచేలా చేస్తాయి. చిరుధాన్యాల్లో ఉండే పాస్ఫరస్‌ శరీరానికి అవసరమైన శక్తినందించే ఖనిజాల్లో ఒకటి. అంతేకాదు ఈ పోషకం నాడీవ్యవస్థనూ ఆరోగ్యంగా మారుస్తుంది. రోజులో కప్పు వండిన చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల మెగ్నీషియం 26.4 శాతం, పాస్ఫరస్‌ 24 శాతం శరీరానికి అందుతాయి. వీటిల్లో ఉండే లిగ్నాన్లు రొమ్ముక్యాన్సర్‌ ప్రభావాన్ని చాలామటుకూ తగ్గిస్తాయి. చిరుధాన్యాలు రోజూ తీసుకునే వారిలో రొమ్ము క్యాన్సర్‌ వచ్చే ఆస్కారం యాభై శాతం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎక్కువమోతాదులో చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల ట్రైగ్లిజరైడ్ల స్థాయులు తగ్గుతాయి. వీటిల్లో ఉండే విటమిన్‌ బి, సంక్లిష్ట పిండిపదార్థాలు శరీరంలో పేరుకొన్న కొవ్వును సులువుగా కరిగేలా చేస్తాయి. వీటి నుంచి అందే నయాసిన్‌ పోషకం చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి, మేలు చేసే కొలెస్ట్రాల్‌ని పెంచుతుంది. ఫలితంగా గుండెజబ్బుల ప్రమాదం తగ్గుతుంది. నయాసిన్‌, మెగ్నీషియం, పాస్ఫరస్‌ లాంటి పోషకాలు అందేందుకు సామల్ని తీసుకోవచ్చు.

ఎలా తీసుకోవాలి..
చిరుధాన్యాల్ని ఒకేసారి కాకుండా నెమ్మదిగా జీవనవిధానంలో చేర్చుకోవాలి. రోజువారీ తీసుకునే ఆహారంలో యాభై, అరవైశాతం వరకూ చిరుధాన్యాలతో చేసిన పదార్థాలుండేలా చూసుకోవాలి. కొందరికి వాటి రుచి నచ్చదు. కొన్నిసార్లు అరగదు. అలాంటప్పుడు చేసుకునే విధానాన్ని ఓసారి గమనించుకోవాలి. సాధారణ పద్ధతిలోనే వాటిని చేసుకోవాలి. అంటే జొన్నరొట్టె, రాగి సంకటి, సజ్జల కిచిడీ రూపంలో తీసుకోవాలి. మెనోపాజ్‌ దాటి అధిక కొలెస్ట్రాల్‌, అధికరక్తపోటు లేదా గుండెజబ్బులొచ్చే ఆస్కారం ఉన్న మహిళలు వారంలో కనీసం ఆరుసార్లు చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల ఆ సమస్యలన్నీ అదుపులో ఉంటాయి.




  • =======================


Visit my Website - Dr.Seshagirirao...