Pages

Labels

Popular Posts

Tuesday, 4 December 2012

Cluster Bean-గోరు చిక్కుడు




  • పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది. 








గోరు చిక్కుడు శాస్త్రీయ నామం... సైమాప్సిస్‌ టెట్రాగోనొలోబా. గింజల్లో సీడ్‌ కోట్‌ (పై పొర), ఎండోస్పెర్మ్‌ (లోపల పప్పు), జెర్మ్‌ అని మూడు భాగాలు ఉంటాయి. ఎండోస్పెర్మ్‌లో గెలాక్టోమెనన్‌ అనే పదార్థం ఉంటుంది. దీని నుంచే జిగురు తయారుచేస్తారు. జోధ్‌పూర్‌లోని సెంట్రల్‌ ఆరిడ్‌ జోనల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (కాజ్రి) ఎక్కువ జిగురును ఇచ్చే గోరు చిక్కుడు రకాలపై పరిశోధనలు చేస్తోంది. గంగానగర్‌లోని  వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పరిశోధనలు సాగుతున్నాయి. గుంటూరు, తిరుపతి నగరాల్లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రాల్లోనూ అధ్యయనం జరుగుతోంది.



    మనం తినే కేకు, మనం రుద్దే పేస్టు, మనం వాడే షాంపూ, మనం పెట్టే కుక్కబిస్కెట్లూ... అన్నింట్లోనూ 'గోరుచిక్కుడు' ఉంది. డాలర్లదేశం ఆశగా భారత్‌ వైపు చూసేది, ఒక్క గోరుచిక్కుడు కోసమే! ఆ జిగురే కనుక అందకపోతే... అమెరికా చేతిచమురు వదుల్తుంది!



గోరుచిక్కుడుతో కూర వండుకోవచ్చు. సాంబార్లో వేసుకోవచ్చు. నచ్చితే రోటిపచ్చడీ చేసుకోవచ్చు. రొట్టెలోకైనా అన్నంలోకైనా బాగానే ఉంటుంది. మొత్తంగా ఇదో 'మినిమమ్‌ గ్యారెంటీ' కూర! అద్భుతమన్న ప్రశంసలు రావు. చండాలంగా ఉందన్న విమర్శలూ ఉండవు. వేడివేడిగా వడ్డిస్తే కిక్కురుమనకుండా తినేస్తారు.



ఇదో మెట్టపంట. వర్షాభావ పరిస్థితుల్ని తట్టుకుంటుంది. ఇసుక నేలల్లో, ప్రతికూల వాతావరణంలో కష్టాల సాగు చేస్తున్న రాజస్థానీ రైతుల జీవితాల్లో  మెరుపులు మెరిపిస్తోంది. నిన్నమొన్నటిదాకా సైకిళ్లకే దిక్కులేని గ్రామాల్లో ఆడి, బీఎండబ్ల్యూ, టొయోటా-ఫార్చూనర్‌ కార్లు కనిపిస్తున్నాయంటే...అంతా  గోరుచిక్కుడు మహత్యమే! రాజస్థానీలను రాజాలుగా మార్చిన ఆ పంట...ఆంధ్రప్రదేశ్‌ రైతులనూ ఆకట్టుకుంటోంది. వివిధ జిల్లాల్లో ఉత్సాహంగా సాగు చేస్తున్నారు.



గోరుచిక్కుడు మనకు తెలిసిన కూరగాయే..! రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పండుతుంది. తెలంగాణాలో దీన్ని 'గోకరకాయ' అని పిలుస్తారు. హిందీలో గౌర్‌ అనీ, ఇంగ్లిష్‌లో క్లస్టర్‌ బీన్‌ అనీ అంటారు. ఈ మొక్క తరాల క్రితమే ఆఫ్రికా నుంచి మన దేశానికి వచ్చిందని నిపుణులు చెబుతారు. ప్రస్తుతం  దక్షిణాసియాలోనే అధికంగా పండుతోంది. భారత్‌లో మరీ ఎక్కువ. ప్రపంచంలో ఉత్పత్తయ్యే గోరుచిక్కుడులో 80 శాతం వాటా మనదే. తర్వాతి స్థానాల్లో  పాకిస్థాన్‌, అమెరికా ఉన్నాయి. దక్షిణాఫ్రికా, మలావి, జైర్‌, సూడాన్‌లలోనూ వాణిజ్య ప్రాతిపదికన సాగు చేస్తున్నారు. మొదట్లో రాజస్థాన్‌ వంటి రాష్ట్రాల్లో   అయితే, ఒంటెలకూ పశువులకూ మేత కోసమే ఎక్కువగా పండించేవారు. గోరుచిక్కుడు జిగురులోని పారిశ్రామిక ప్రయోజనాలు తెలియడంతో...ఆ పంట దిశ  మారింది. రైతన్న దశా మారింది. జోధ్‌పూర్‌, బికనీర్‌, గంగానగర్‌, జైపూర్‌, ఆల్వార్‌ ప్రధాన మార్కెట్లుగా అవతరించాయి. గుజరాత్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌ రైతులు పోటీపడి పండిస్తున్నారు. కుబేరులూ కార్పొరేట్లూ కూడా గోరుచిక్కుడు పంట మీద ఆసక్తి చూపుతున్నారు.



గోరుచిక్కుడు పంట చేతికి రాగానే బాగా ఎండబెట్టి, గింజల పొట్టు తీస్తారు. వాటిని పప్పుగా చేస్తారు. ఆ పొడిలో నీళ్లు కలిపితే జిగటజిగటగా మారుతుంది.  ప్రత్యేకంగా జిగురు కోసమే పండించే గోరుచిక్కుడును 'గమ్‌గౌర్‌' అని వ్యవహరిస్తారు. ఐస్‌క్రీమ్‌లు, సాఫ్ట్‌ డ్రింకులు, పుడ్డింగ్స్‌, చాకొలెట్‌ మిల్క్‌, ఫ్లేవర్డ్‌ మిల్క్‌,  జామ్‌, జెల్లీ, బ్రెడ్‌, బిస్కెట్‌, సాస్‌, కెచప్‌, చీజ్‌, క్యాన్డ్‌ ఫిష్‌, క్యాన్డ్‌ మీట్‌, నూడుల్స్‌, పాస్తా...ఇలా రకరకాల ఆహార పదార్థాల్లో వాడతారు. గోరుచిక్కుడు  జిగురులో కేలరీలు ఉండవు. జీర్ణవ్యవస్థ శుద్ధికి ఉపయోగపడుతుంది. కొద్దిగా తీసుకున్నా పొట్ట నిండినట్టు అనిపిస్తుంది. దీంతో బరువు తగ్గాలనుకునేవారి  కోసం ప్రత్యేకంగా తయారు చేసే ఆహార పదార్థాల్లో గోరుచిక్కుడు జిగురును విరివిగా వాడుతున్నారు. పోషకాహారాల తయారీలో, చర్మ సౌందర్యానికి వాడే  లోషన్లలో దీన్ని వినియోగిస్తారు.



వస్త్ర పరిశ్రమ, ముద్రణ, అగ్నిమాపక పదార్థాల తయారీ, సిరామిక్స్‌, దోమల నివారిణులు, కాగితం, వాటర్‌ పెయింట్లు, చమురు బావుల తవ్వకాలు, మైనింగ్‌,  పేలుడు పదార్థాల తయారీలో...గోరుచిక్కుడు జిగురు చాలా కీలకం. చమురు-గ్యాస్‌ బావులకైతే జిగురు లేకపోతే పనే నడవదు. అమెరికా షేల్‌ ఆయిల్‌, షేల్‌  గ్యాస్‌ వెలికితీతపై దృష్టి పెట్టడంతో...మన దేశంలో గోరుచిక్కుడు జిగురు ధరకు  రెక్కలొచ్చాయి. గతంలో క్వింటాలుకు రెండువేల నుంచి నాలుగువేల మధ్య  ఉన్న గింజల ధర గత ఏడాది ముప్పై అయిదువేలు పలికింది. జిగురు ధర లక్షా పదివేల పైమాటే. గోరుచిక్కుడు జిగురుకు అంతర్జాతీయ మార్కెట్లో గొప్ప గిరాకీ ఉంది. అమెరికా తన చమురు పరిశ్రమ అవసరాల కోసం భారత్‌ జిగురుపైనే ఆధారపడుతోంది.



షేల్‌గ్యాస్‌ లేదా నూనె వెలికితీసే 'ఫ్రాకింగ్‌' ప్రక్రియలో ఇది కీలకమైంది. ఇంతకీ షేల్‌ గ్యాస్‌/ఆయిల్‌ అంటే ఏమిటి? ఫ్రాకింగ్‌లో ఏం చేస్తారూ  అంటే..సాధారణంగా సహజవాయువూ చమురూ భూమిలోని రాతి పొరల్లో నిక్షిప్తమై ఉంటాయి. భూమి లోపలికంటా తవ్వి బావుల నుంచి వెలికి తీయాలి.  సాధారణంగా ఇసుకరాయి (శాండ్‌ స్టోన్‌), సున్నపురాయి (లైమ్‌ స్టోన్‌) పొరల్లో నిక్షేపాలు ఉంటాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 90 శాతం  సహజవాయువూ చమురూ ఈ రెండురకాల రాళ్ల నుంచే వస్తోంది. ఇసుకరాయిలో రేణువుకీ రేణువుకీ మధ్య, సున్నపురాయిలో లైమ్‌స్టోన్‌లో పొరల మధ్య  ఉన్న ఖాళీలలో గ్యాస్‌, ఆయిల్‌ ఉంటాయి. సంప్రదాయ విధానంలో శిలల్ని బుల్లెట్‌తో పేలుస్తారు. కొన్నిసార్లు రసాయనాలూ పంపిస్తారు. అప్పుడు రాళ్లల్లో  నిక్షిప్తమైన గ్యాస్‌, ఆయిల్‌ బావుల్లోకి వచ్చేస్తుంది. ఇక షేల్‌ గ్యాస్‌నూ షేల్‌ ఆయిల్‌నూ వెలికితీయడం కొంత భిన్నమైన విధానం. భూమి లోపల బంకమట్టి  గట్టిపడగా ఏర్పడిన రాళ్లనే 'షేల్‌' అంటారు. ఈ రాళ్లలో చాలా పలుచని పొరలు ఉంటాయి. భూమి లోపలికి వెళ్లేకొద్దీ ప్రతి 100 మీటర్లకూ మూడు డిగ్రీల  చొప్పున ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది. అత్యధిక ఉష్ణోగ్రత, ఒత్తిడి తదితర కారణాల వల్ల... కాలక్రమంలో బంకమట్టి గట్టిపడి 'హార్డ్‌రాక్‌'గా మారుతుంది. ఈ  ప్రక్రియలో మట్టిలో ఉండే నీరు, చమురు వంటివి చాలా వరకూ బయటికెళ్లిపోతాయి. ఇంకా కొంత గ్యాస్‌, ఆయిల్‌ రాతి పొరల మధ్యలో చిక్కుకుపోయి  ఉంటుంది. దీన్ని బయటికి తీయాలంటే రాతిని ముక్కలు చేయాలి. పగుళ్లు సృష్టించాలి. పొరలమధ్య దూరాన్ని పెంచాలి. షేల్‌ గ్యాస్‌/ఆయిల్‌ కోసం భూమి  లోపలి వరకు నిట్టనిలువుగా తవ్వకాలు (డ్రిల్లింగ్‌) జరుపుతారు. మట్టిపొరలు తగిలాక భూమిలోపల సమాంతరంగా తవ్వకాలు చేస్తారు, నీటిలో వివిధ  రసాయనాల్ని కలిపి ఎక్కువ పీడనంతో భూమి లోపలికి పంపుతారు. మట్టి రేణువుల మధ్య ఖాళీ ఏర్పడేలా చేస్తారు. అప్పుడే దాన్లోని చమురు గ్యాస్‌  బావిలోకి చేరుతుంది. భారీగా నీటిని వాడతారు కాబట్టి ఈ ప్రక్రియను హైడ్రో ఫ్రాక్చరింగ్‌ అనీ ఫ్రాకింగ్‌ అనీ పిలుస్తారు. ఇలా భూమి లోపలికి పంపించే  పదార్థాన్ని ప్రొపొనెంట్‌ అంటారు. 'షేల్‌' బావుల్లోకి పంపే ప్రొపొనెంట్స్‌లో ఎక్కువ శాతం గోరుచిక్కుడు జిగురు ఉంటుంది. ఆ పదార్థం లేకుండా షేల్‌ గ్యాస్‌  తవ్వకాలు అసాధ్యం. అమెరికాలో ప్రస్తుతం 30 శాతం వరకు గ్యాస్‌ 'షేల్‌' నుంచే వస్తోంది. మనం జిగురు సరఫరా చేయకపోతే ఆ బావులన్నీ  మూతపడినట్టే. అందుకే మరి, మన దగ్గర గోరుచిక్కుడు ఉత్పత్తి తగ్గితే అమెరికాకు చెమటలు! షేల్‌ గ్యాస్‌ వెలికి తీయడం కొంత సంక్లిష్టమైన ప్రక్రియే అయినా, చాలా దేశాలు దీనిపై దృష్టి సారిస్తున్నాయి. సంప్రదాయ ఇంధన వనరులు క్రమంగా  తగ్గుముఖం పడుతుండటంతో ప్రత్యామ్నాయాలు వెతుక్కోవడం తప్పనిసరి అవుతోంది. పైగా సహజవాయువుల కోసం, చమురు కోసం పూర్తిగా  దిగుమతులపైనే ఆధారపడటం ఎప్పటికైనా ప్రమాదమే. ప్రపంచంలోని చాలా దేశాల్లో షేల్‌ గ్యాస్‌/ఆయిల్‌ నిల్వలు ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతానికి, కొన్ని  దేశాలు మాత్రం వెలికి తీస్తున్నాయి. భారత్‌ కూడా షేల్‌ గ్యాస్‌ ప్రాధాన్యాన్ని గుర్తించింది. మన దగ్గరే కాదు, పొరుగు దేశాల్లోనూ లీజుల ద్వారా తవ్వకాలు  జరుపుతామని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఆ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది కూడా. అమెరికాలో అయితే ఎప్పుడో  2004లోనే ఈ కార్యక్రమం వూపందుకుంది. ప్రస్తుతం అక్కడ 30 శాతం సహజవాయువు షేల్‌ నుంచే వస్తోంది. మనం కూడా షేల్‌ గ్యాస్‌ వంటి  ప్రత్యామ్నాయాల్ని వెతకాల్సిన అవసరం చాలా ఉంది. భారత్‌లో చాలా చోట్ల 'షేల్‌' ఉన్నా, గ్యాస్‌/ఆయిల్‌ నిక్షేపాలు కలిగిన షేల్‌ కొన్ని చోట్లే ఉంటుందని  చమురు రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మన అవసరాలకు 176 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల చమురు అవసరమైతే, 2011-12లో 48  మిలియన్‌ మెట్రిక్‌ టన్నులే ఉత్పత్తి చేయగలిగాం. గ్యాస్‌ 64 బీసీఎం (బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు) అవసరమైతే గత సంవత్సరం 52 బీసీఎం ఉత్పత్తి  చేయగలిగాం. మిగిలింది అంతా, విదేశాల నుంచే దిగుమతి  సుకుంటున్నాం. భవిష్యత్‌తో షేల్‌ ప్రాధాన్యం మరింత పెరగడం ఖాయం. దాంతోపాటే...  గోరుచిక్కుడు మార్కెట్‌ కూడా!



దేశంలో ఉత్పత్తి అవుతున్న గోరుచిక్కుడు జిగురులో 75 శాతం వరకు రాజస్థాన్‌ నుంచే వస్తోంది. ఈ పరిశ్రమలకు జోధ్‌పూర్‌ ప్రధాన కేంద్రం. గంగానగర్‌లో  ఓ పరిశోధన కేంద్రం కూడా ఉంది. రాజస్థాన్‌లో వర్షాలు అంతంతమాత్రమే కావడంతో కాలం కలిసొస్తే నాలుగు గింజలు రాలేవి. రైతుకు నాలుగు రాళ్లు  వచ్చేవి. ధరలూ తక్కువే కావడంతో గోరుచిక్కుడు సేద్యం లాభదాయకంగా ఉండేది కాదు. దళారుల దోపిడీ సరేసరి. వ్యాపారులు, పరిశ్రమల యజమానులు  మాత్రం బాగుపడేవారు. గత సంవత్సరం పరిస్థితి మారిపోయింది. ఉత్తర అమెరికాలో షేల్‌ గ్యాస్‌ బూమ్‌తో గోరుచిక్కుడు జిగురుకు ఒక్కసారిగా గిరాకీ  పెరిగింది. ధరలు నింగినంటాయి. వూహించని డబ్బు వచ్చిపడటంతో రాజస్థాన్‌ రైతులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. ప్రజల జీవనశైలే మారిపోయింది. అప్పటి  వరకు గుడిసెల్లో బతుకీడుస్తున్నవారు పక్కా ఇళ్లు కట్టుకున్నారు. టీవీ, ఫ్రిజ్‌ వంటి గృహోపకరణాలు సమకూర్చుకున్నారు. ట్రాక్టర్లు కొనుక్కున్నారు.  ఆమధ్య గంగానగర్‌కు చెందిన 70 ఏళ్ల బీర్బల్‌ 20 క్వింటాళ్ల గింజల్ని దాదాపు ఐదున్నర లక్షలకు విక్రయించాడు. విత్తనాల కోసం క్వింటాలు గింజల్ని  దాచుకున్నాడు. వాటిని దొంగలు ఎత్తుకెళ్లకుండా గట్టి కాపలా ఏర్పాటు చేసుకున్నాడట. వ్యాపారి రాధేశ్యామ్‌ గోరుచిక్కుడులో సంపాదించిన లాభాలతో 

హాంకాంగ్‌లో స్థిరాస్తి వ్యాపారం చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడట. సేద్యానికి  ట్టుబడి సమస్యే లేదు. రైతులు వ్యాపారుల దగ్గరకు వెళ్లడం కాదు...  వ్యాపారులే రైతుల దగ్గరకు వచ్చి బయానా సమర్పిస్తున్నారు. విత్తనాలూ గట్రా సరఫరా చేస్తున్నారు. రైతేరాజు అన్నమాట రాజస్థాన్‌ రైతన్నల విషయంలో  నిజమవుతోంది! గోరుచిక్కుడు పంటలోనూ, గోరుచిక్కుడు జిగురు ఎగుమతిలోనూ మనదేశం అగ్రగామిగా ఉంది. అంతర్జాతీయ పారిశ్రామిక అవసరాల్లో ఎనభై శాతం దాకా  ఇక్కడి నుంచే వెళ్తోంది. భారత్‌లో గోరుచిక్కుడు గింజల సగటు ఉత్పత్తి 10-11 లక్షల టన్నులు. దేశం నుంచి 1-1.5 లక్షల టన్నుల జిగురు ఏటా  ఎగుమతి అవుతోంది. మరో 20 నుంచి 30 వేల టన్నుల జిగురును దేశీయంగా వినియోగిస్తున్నాం. మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న ఆహార  పదార్థాల్లో బాస్మతి బియ్యం తర్వాతి స్థానం గోరుచిక్కుడుదే. అయితే, భారత్‌ నుంచి గింజల రూపంలో గోరు చిక్కుడు ఎగుమతుల్లేవు. దీనిపై నిషేధం  విధించారు. పప్పు లేదా జిగురు రూపంలోనే పంపాలి. ధరలు అదుపు తప్పడంతో ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌ను కూడా నిలిపేశారు. ఉత్తర భారతంలో దీన్ని ఖరీఫ్‌ 

పంటగా వేస్తారు. గత సీజన్‌లో అక్కడ 12 లక్షల టన్నుల గింజలు పండించారు. ఈ సంవత్సరం 15 నుంచి 18 లక్షల టన్నుల దాకా చేతికొస్తుందని  భావిస్తున్నారు. ప్రస్తుతానికైతే, గోరుచిక్కుడు ధరలు తగ్గాయి. అయినా క్వింటాలుకు రూ.8 వేల దాకా పలుకుతోంది.



కూరగాయ గోరుచిక్కుడుకీ జిగురు గోరు చిక్కుడుకీ కొంత తేడా ఉంది. కూరగాయగా పండించడం అన్నది, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉంది. గత ఏడాది  ఒక్కసారిగా డిమాండ్‌ పెరగడంతో కూరగాయగా పండించిన గోరుచిక్కుడునే కొందరు రైతులు జిగురు కోసం విక్రయించారు. ఇప్పుడు రాజస్థాన్‌, గుజరాత్‌ల  నుంచి విత్తనాలు తెచ్చుకుని వాణిజ్య ప్రాతిపదికన సాగు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అనంతపురం జిల్లా వంటి వర్షాభావ ప్రాంతాల్లో ఇప్పటికే  ప్రభుత్వ ప్రోత్సాహంతో సాగు చేస్తుండగా...ఇప్పుడు గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లోను పెద్ద ఎత్తున సాగు చేయాలని భావిస్తున్నారు. మన రాష్ట్రం  నెలనెలా 200 టన్నుల జిగురును ఉత్తరభారతం నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇందులో 50 టన్నుల వరకు మస్కిటో కాయిల్స్‌ తయారీకే  వాడుతున్నారు. గోరుచిక్కుడులో రెండు రకాలు... 80-90 రోజుల్లో కోతకు వచ్చేవి ఉన్నాయి, 120-125 రోజుల్లో కోతకు వచ్చేవీ ఉన్నాయి. పెద్దగా తెగుళ్లు  లేకపోవడం, వర్షాభావ పరిస్థితుల్ని తట్టుకునే గుణం ఉండటం, పెట్టుబడి తక్కువ కావడం, గిరాకీ బాగుండటం... తదితర కారణాల వల్ల రైతులు మక్కువ  చూపుతున్నారు. పత్తి, మిరప దెబ్బతీస్తుండటంతో గోరు చిక్కుడు ఆశాకిరణంలా కనిపిస్తోంది. అలా అని, అనాలోచితంగా అడుగు ముందుకేయడమూ 

ఇబ్బందే. దీనిపై ఇంకా కొంత అధ్యయనం జరగాల్సి ఉంది. అన్ని కాలాల్లో, అన్ని నేలల్లో, వివిధ వాతావరణ పరిస్థితుల్లో పండించి చూసిన తర్వాత కానీ ఒక  నిర్ణయానికి రావడం కష్టమంటున్నారు అనుభవజ్ఞులు.



ఆంధ్రప్రదేశ్‌లో మొదలైన హంగామా ... రాజస్థాన్‌, గుజరాత్‌ వ్యాపారులను ఆకర్షిస్తోంది. పల్లెల్లో ప్రత్యక్షమైపోయి, క్వింటాలుకి రూ.10-12 వేలు  ఇస్తామంటూ రైతులతో ఒప్పందం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మన రైతుల్లో చాలా మంది ముందస్తు ఒప్పందానికి సిద్ధంగా లేరు. సీజన్‌లో  మంచి ధరలు వస్తాయన్న ఆశ వారిలో కనిపిస్తోంది. ''ముప్పై ఏళ్ల నుంచీ గోరు చిక్కుడు పండిస్తున్నా. ఇది వరకు పంటలో పనికిరాని విత్తనాల్ని జిగురు  కోసం పంపించేవాళ్లం. ఇప్పుడు గిరాకీ పెరగడంతో 10 ఎకరాల్లో కేవలం జిగురు గోరుచిక్కుడునే పండించాలని అనుకుంటున్నా. ఎకరానికి రూ.10 వేల  వరకూ పెట్టుబడి అవుతుంది. తెగుళ్లు తక్కువ. క్వింటాలుకి రూ.8 వేలు ధర వచ్చినా కూడా, మిగతా అన్ని పంటల కంటే ఇది లాభదాయకంగా ఉంటుంది''  అంటారు గుంటూరు జిల్లా కాకుమానుకు చెందిన జెట్టి రత్తయ్య. ఈ పంట మన రాష్ట్రానికి చాలా అనుకూలమని, ప్రస్తుతం మంచి గిరాకీ ఉన్నందున రైతులు  సాగు చేయవచ్చునని విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త ఆలపాటి సత్యనారాయణ అభిప్రాయపడుతున్నారు. మన రాష్ట్రంలో ఈ ఖరీఫ్‌లో 6645 ఎకరాల్లో  జిగురు గోరుచిక్కుడును సాగు చేస్తున్నారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే 3500 ఎకరాల్లో సాగు ఉంది. ఏది ఎలా ఉన్నా, మార్కెట్‌ పరిస్థితుల్ని దృష్టిలో  ఉంచుకుని పంట వేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. అందరూ వేలం వెర్రిగా ఇదే పంట వేసినా, సరఫరా పెరిగి ధరలు పడిపోతే నష్టపోవాల్సి  వస్తుందని హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయంగా మాత్రం పరిస్థితులు ఆశాజనకంగానే ఉన్నాయి. ప్రస్తుతం షేల్‌ గ్యాస్‌ ఎక్కువగా అమెరికాలోనే వెలికి తీస్తున్నారు. చైనాలో కూడా భారీ  నిల్వలు ఉన్నట్టు అంచనా. మరికొన్ని దేశాలు త్వరలో షేల్‌ గ్యాస్‌ వెలికితీయడంపై దృష్టి పెట్టనున్న నేపథ్యంలో భవిష్యత్‌ బంగారమే అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రైతన్న గోరుచిక్కుడుపై కొండంత ఆశే పెట్టుకున్నాడు. గోరుచిక్కుడు జిగురుకు ఔషధగుణాలున్నాయి. కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. ఇందులో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. టన్ను నాణ్యమైన గోరుచిక్కుడుతో 300 కిలోల జిగురు తయారవుతుంది. సాధారణ జిగురుతో పోలిస్తే... ఆయిల్‌, గ్రీజు వంటి వాటిని కూడా తట్టుకుని నిలిచే శక్తి ఉంది. వర్షాభావ పరిస్థితుల వల్ల అనంతపురం జిల్లాలో వేరుసెనగ పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. దీంతో ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేసేందుకు 'ఆపరేషన్‌  అనంత' పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్‌)  శాస్త్రవేత్తల బృందం అనంతపురం వెళ్లి అధ్యయనం చేసింది.  వివిధ ప్రత్యామ్నాయ పంటలు సూచించింది. వాటిలో గోరుచిక్కుడు ఒకటి. సాగు లాభదాయకంగా అనిపించడంతో రైతులు మొగ్గు చూపుతున్నారు.  అనంతపురం రైతులకు  ఇచ్చేందుకు విత్తనాలు కావాలంటూ రాజస్థాన్‌ విత్తనాభివృద్ధి సంస్థను మన ప్రభుత్వం కోరింది. కానీ వాళ్లు చేతులెత్తేశారు. దీంతో జోధ్‌పూర్‌ కేంద్రంగా  నిచేస్తున్న ఓ ప్రైవేటు పరిశ్రమ పంటను తిరిగి కొంటామంటూ ఉచితంగా విత్తనాలు అందజేసింది. ఒకటిరెండు పంటలు బాగా వస్తే... సాగు పుంజుకునే అవకాశం ఉంది.





Courtesy with--జె.కళ్యాణ్‌బాబు, ఈనాడు, గుంటూరు @Eenadu sunday magazine


  • =========================


Visit my Website - Dr.Seshagirirao...